Rahasya-Puraanamu-mahaa-bhaagavathamu


రహస్యమైన పురాణము “మహా భాగవతము”

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
***
ఓం శ్రీ వేదవ్యాసాయ నమః
ఓం శ్రీశుకదేవాయ నమః
ఓం సద్గురు దత్తాత్రేయాయ నమః 
ఓం సద్గురు శ్రీపాద శ్రీవల్లభాయ నమః 
ఓం శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామియే నమః
***

శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి 
  వాసరాపీఠనిలయే శ్రీ ఙ్ఞానసరస్వతి నమోస్తుతే!
***
 గురుబ్రహ్మ, గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
***
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం 
తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః

   ఓం నమో భగవతే వాసుదేవాయ 
  ఓం నమో భగవతే వాసుదేవాయ 
  ఓం నమో భగవతే వాసుదేవాయ


భాగవతకృష్ణుని చేతి వెన్నముద్దలు
1.  భాగవతము మహారహస్యమైన పురాణము. ఇది భగవత్స్వరూపము యొక్క అనుభవమును కలుగజేయును.
2.  బుద్ధిరూపమగు మాయ తొలగగనే జీవుడు పరమానందమయుడై తన స్వరూప మహిమయందు ప్రతిష్థితుడగుచున్నాడు.
3.  నిష్కామ కర్మ యోగము నందు నిశ్చయాత్మకబుద్ధి ఒకటియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై, ఒకదారీ తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును.
4.  సమస్త లోకములకు ప్రభువైన శ్రీకృష్ణుని యెడల సర్వాత్మకమగు ఆత్మభావము, అనిర్వచనీయమైన అనన్య ప్రేమ, దైవభక్తిచే మనుజుడు సంసారచక్రమందు పడనేరడు.
5.  రసము, భావము, అలంకారము మున్నగు వానితో కూడియున్నప్పటికిని ఏ వాక్కు లోకమును పవిత్రమొనర్చు శ్రీకృష్ణుని కీర్తిని ఎపుడైన గానమొనర్చలేదో అది వ్యర్థమగును.
6.  పురుషోత్తముడగు శ్రీకృష్ణునకు సమస్త కర్మలను సమర్పించుటయే ప్రపంచమందలి తాపత్రయమునకు ఏకైక చికిత్స.
7.  భగవంతుని ప్రసన్నత కొఱకై  ఏ కర్మలు చేయబడుచున్నవో, వానిచే పరాభక్తి యుక్తమగు ఙ్ఞానము కలుగుచున్నది.
8.  సుందర స్త్రీలు తమ కామ విలాసములచే శ్రీకృష్ణుని మనస్సునందు ఒంకింతైనను  క్షోభను కలుగజేయజాలకుండిరి. (అసంగుడు)
9.  దైవశరణాగతమగు బుద్ధి ప్రాకృత గుణములను అంటనట్లు ప్రకృతి యందున్నను భగవానుడు దాని గుణములచే ఎన్నడును అంటనేరడు. ఇదియే భగవంతుని భగవత్తత్త్వము.
10.    అభయపదమును పొందదలచినవాడు సర్వాత్మయు, సర్వశక్తిమంతుడును శ్రీహరియునగు భగవంతుని గూర్చి శ్రవణము, సంకీర్తనము, స్మరణము గావించవలయును.
11.  ఏవిధముగనైనను ఙ్ఞానముచే గాని, భక్తిచే గాని, ధర్మనిష్ఠచే గాని జీవితమును అంత్యకాలమున భగవంతుని గూర్చిన స్మృతి తప్పక ఉండులాగున చేసికొనవలెను. ఇదియే మానవ జన్మయొక్క గొప్పలాభము.
12.  భగవన్నామములను ప్రేమతో సంకీర్తనము చేయవలెను. సమస్త శాస్త్రముల యొక్క నిర్ణయమిదియే అయియున్నది.
13.జాగ్రత్తగ ఙ్ఞానపూర్వకముగ గడుపబడిన ఒక గడియ, రెండు గడియల కాలమైనను శ్రేష్టమైనది. రాజర్షియగు ఖట్వాంగుడు రెండు గడియలలోనే అంతయు వదలి భగవంతుని అభయ పదమును పొందెను.
14.దేనిని పొంది మనస్సు పరమ ప్రశాంతిని, ఆనందమును బడయునో అదియే విష్ణుభగవానుని యొక్క ఉత్తమపదం.
15.  విశ్వేశ్వరుడగు భగవంతుడు దృశ్యము కాదు.
16.  ద్రష్ట, సగుణము, నిర్గుణము  అంతయు వారి స్వరూపమే అయిఉన్నది.
17.  భక్తి చేతనే అంతఃకరణము యొక్క పూర్ణశుద్ధి కాగలదు.
 18.  భగవంతుని లక్షణాలు:
సత్యం, పవిత్రత, దయ, క్షమ, త్యాగం, సంతోషము, సరళత్వము, శమము, దమము, తపస్సు, సమత్వము, తితీక్ష, ఉపరతి, శాస్త్రవిచారణ, ఙ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, వీరత్వము, తేజస్సు, బలము (ధృతి), స్మృతి, స్వతంత్రత, కౌశలము, కాంతి, ధైర్యము,కోమలత్వము, నిర్భయము, వినయము, శీలము, సాహసము, ఉత్సాహము, బలము, సౌభాగ్యము, గంభీరత్వము, స్థిరత్వము, ఆస్తికత, కీర్తి, గౌరవము, నిరహంకారము అను ఏ 39 అపాకృత గుణములను, మహనీయులచే వాంఛనీయులగు శరణాగత వత్సలత్వము మున్నగు అనేక గొప్ప సుగుణములున్ను వారిసేవ యెనర్చుటకై నిరంతరము నివసించుచున్నవో, ఒక్క క్షణమైనను వారినుండి వేఱుగనుండవో, అట్టి సమస్త సుగుణములకు ఆశ్రయుడు భగవానుడు.
19. సర్వాత్మరూపుడగు భగవంతుడు వాయువువలె, సమస్త చరాచర ప్రాణులయొక్క లోపల, బయట ఏకరూపుడై యుండుచు వారి వాంఛితములను  నెరవేర్చుచున్నారు.
20.  కలియుగంలో “సత్యం” ఒకటియే మిగిలిఉన్నది.
21.  కలి దోషాలు జూదము, మద్యపానము, స్త్రీ సంగం, హింస, సువర్ణము. ఈ స్థానములందు క్రమముగ అసత్యము, మదము, ఆసక్తి, నిర్దయత్వము (వైరము), రజోగుణము అను అధర్మములు నివసించుచుండును. కావున ఆత్మశ్రేయమును కోరువాడీ ఐదు స్థానములను ఎన్నడును సేవించరాదు.
22.  ఎవరు శ్రీకృష్ణుని లీలాకథను చెప్పుచుందురో, ఆ కథామృతమును పానమొనర్చుచుందురో, ఆ రెండు సాధనల ద్వారా వారి పాదపద్మములను స్మరించుచుందురో, అట్టివారికి అంత్యకాలమందును మోహము కలుగకుండును.
23.  కలి అఙ్ఞానులందు శూరుడుగను, ధీరులగు ఙ్ఞానులందు పిరికివాడుగను ఉండును. ప్రమత్తులై ధర్మవిషయుమున అజాగ్రత్తగా నుండు వారిని వశమొనర్చుకొనుటకై, ఇతడు సదా సావధానుడై యుండును.
24.  ’అ’ కార, ’ఉ’కార, ’మ’ కారములను మూడు మాత్రలతో కూడిన ప్రణవమును (ఓం కారము) మనస్సునందు జపించవలెను. ప్రాణవాయువును వశమందుంచుకొని మనస్సును దమనం చేయవలెను. చంచలమైన మనస్సును విచారణ ద్వారా నిరోధించి, భగవంతుని మంగళమయ రూపమందు నిలుపవలెను. దేనిని పొంది మనస్సు పరమశాంతిని, ఆనందమును బడయునో అదియే విష్ణు భగవానుని యొక్క ఉత్తమపదము.
25.  అనన్యమైన ప్రేమమయమైన భక్తి యోగము కలుగనంతవఱకు, సాధకుడు నిత్యనైమితికల కర్మల నాచరించిన పిదప, ఏకాగ్రత్తతో భగవంతుని స్మరణ చేయవలెను.
26.  మనుజునకు ఏ సాధన ద్వారా భగవంతుని యెడల అనన్య భక్తి కలుగగలదో, అది తప్ప శ్రేయస్కరమగు మఱియొక మార్గము లేదు.
27.  భగవంతుడగు బ్రహ్మదేవుడు వేదములన్నింటిని మూడుసార్లు పరిశీలించి, దేనిచే సర్వాత్మయగు శ్రీకృష్ణుని యందు అనన్యప్రేమ కలుగగలదో అదియే సర్వశ్రేష్ఠమగు ధర్మమని తన బుద్ధిచే నిశ్చయించెను.
28.  సజ్జనులగు మహనీయులు ఆత్మస్వరూపుడైన భగవంతుని కథలను గూర్చిన మధురమైన అమృతమును పంచిపెట్టుచునే యున్నారు. ఎవరు తమ కర్ణపుటములతో దానిని త్రాగుదురో వారి హృదయములందు విషయములను గూర్చిన విషప్రభావము తొలగిపోవును. వారు శుద్ధులగుదురు. మఱియు వారు భగవంతుని పాదపద్మముల సాన్నిధ్యమును పొందుదురు.
29. పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపము ఏకమై, శాంతమై, అభయమై కేవలము ఙ్ఞానస్వరూపమై యున్నది. వాక్కు అచటికి వెళ్ళజాలదు. పెక్కు సాధనలచే సంపన్నములగు కర్మల యొక్క ఫలమున్ను అచటికి చేరజాలదు. స్వయంగ మాయయు ఆ పరమాత్మ యొద్దకు పోజాలదు.
30.  ఎవరు భగవంతుని అచింత్య శక్తియగు మాయ యొక్క వర్ణనమును, ఇతరులచే గావింపబడిన భగవద్వర్ణనమును విని సంతోషించునో, మఱియు శ్రద్ధతో నిత్యము శ్రవణమొనర్చునో, అట్టివారి చిత్తము మాయచే ఎన్నడును మోహితము కానేరదు.
31.  దేహాదులకు అతీతమైన అనుభవస్వరూపమగు ఆత్మకు మాయచే తప్ప దృశ్య పదార్థములతో ఏ సంబంధమున్ను ఉండనేరదు.
32.  తపస్సు భగవంతుని యొక్క దుర్లంఘ్యమైన శక్తి అయివున్నది.
33.  అన్వయ, వ్యతిరేక పద్ధతులద్వారా సర్వాతీత, సర్వ స్వరూప పరమాత్మయే సర్వదా, సర్వత్ర వెలయుచున్నారు.
34. భగవత్కథ యొక్క రుచి శ్రద్ధాళువుయొక్క హృదయమున వృద్ధి నొందునపుడు ఇతర విషయముల నుండి అతనిని విరక్తునిగ జేయును. అతడు భగవచ్చరణముల యొక్క నిరంతర చింతనచే ఆనందమయుడగును. మఱియు అతని దుఃఖములన్నియు తత్ క్షణము నశించిపోవును.35.  పూర్వపు పాపము వలన, జనులు శ్రీహరి యొక్క కథల యెడల విముఖులై ఉందురు. వారు వాక్కు చేతను, శరీరము చేతను, మనస్సు చేతను వ్యర్థ వాద వివాదములందును, వ్యర్థ చేష్టలందును, వ్యర్థ చింతన మందును నిమగ్నులై యుండుచున్నారు.
36.  భగవంతుని యొక్క కథామృతమును పానమొనర్చుటచే పొంగిపొరలిన భక్తిచే నిర్మలమైనట్టి అంతఃకరణము గలవారు వైరాగ్యమే సారముగా గల ఆత్మఙ్ఞానమును పొంది అనాయసముగనే మీ యొక్క వైకుంఠధామము నకేగుచున్నారు.
37. సమాధి బలముచే కొందరు ప్రబలమగు మాయను జయించి పరమాత్మయందే లీనమగుచున్నారు. కాని వారికి చాలశ్రమ కలుగుచున్నది. అయితే భగవంతుని సేవా మార్గమందే మాత్రము కష్టము లేదు.
38.  కీర్తింపదగినట్టి శ్రీహరి యొక్క గుణములను గానమొనర్చుటయే మనుజుల వాక్కునకును, విద్వాంసుల ముఖతః భగవత్కథామృతమును పానమొనర్చుటయే మనుజుల చెవులకును చాల గొప్ప లాభమని మహాత్ముల అభిప్రాయమై యున్నది.
39.  ఏ ఆత్మ సర్వులకును ప్రభువై వున్నదో అది దీనత్వమును, బంధనమును పొందుట, తప్పక యుక్తి విరుద్ధమై యున్నది. కాని వాస్తవముగ ఇదియే భగవంతుని మాయయై యున్నది.
40. జలమునందలి కంపనాదులు ప్రతిబింబిత చంద్రుని యందు తోచునట్లును ఆకాశమందలి చంద్రుని యందు ఉండవు. దేహాభిమానియగు జీవుని యందే దేహధర్మములు తోచునుగాని పరమాత్మ యందు కాదు.
41.    నిష్కామభావముతో ధర్మములను ఆచరింపగా భగవత్కృపచే లభించు భక్తియోగము ద్వారా ఈ ప్రతీతి (అఙ్ఞానము) మెల్ల మెల్లగా తొలగిపోవును.42. ఎపుడు ఇంద్రియములన్నియు విషయములనుండి మఱలి సాక్షియు, పరమాత్మయునగు శ్రీహరి యందు నిశ్చలముగ నెలకొనియుండునో, అపుడు జీవుని రాగద్వేషాది సమస్త క్లేశములు పూర్తిగ నశించిపోవును.
43.  శ్రీకృష్ణుని గుణముల వర్ణనము, శ్రవణము దుఃఖ రాశినంతను శమింపజేయును.
44.  అనాత్మ పదార్థము వాస్తవముగ లేదు, అది కేవలము ప్రతీతమగుచున్నది.
45.  అల్ప పుణ్యము కలవానికి మహనీయుల సేవాభాగ్యము లభించుట చాల కష్టము.
46. గురువులు తమ ప్రియశిష్యులకు, పుత్రులకు అడుగకుండగనే వారికి హితకరములైన వాక్యములను చెప్పుచుందురు.
47. మనుజుడు ఎంతవరకు భగవంతుని యొక్క అభయప్రదములగు పాదకమలములను ఆశ్రయించడో, అంతవఱకు అతనికి ధన, గృహ, బంధువుల వలన కలుగు భయము, శోకము, ఆశ, దీనత్వము, మహాలోభము మున్నగునవి బాధించుచుండును.
48. ఎవరు విద్వాంసులైయున్నను మీ యొక్క కథా ప్రసంగమునకు విముఖులైయుండినచో వారున్ను సంసారమందు తగుల్కొదురు. అనేక మనోరథముల వలన నిద్రాభంగము కలవారై ఉందురు. మఱియు ద్రవ్యసిద్ధి కొఱకై వారి ప్రయత్నములన్నియు కూడ విఫలములై పోవును.
49.  భగవంతుని యొక్క మార్గము గుణముల శ్రవణము చేతనే ఎఱుగ బడుచున్నది.
50. మనుజుల భక్తియోగము ద్వారా పరిశుద్ధమైన హృదయ కమలమందు భగవంతుడు నివసించుచున్నాడు.
51.  ఏ కర్మ భగవంతునికి అర్పణ చేయబడుచుండునో అద్దానికెపుడును నాశనము ఉండదు. అది అక్షయమై పోవును.
52.    ఎవడు అంత్యకాలమున భగవంతుని యొక్క అవతారములను, గుణములను, నామములను వివశుడై ఉచ్చరించునో, అతడు అనేక జన్మలందు చేసిన పాపములనుండి తత్ క్షణమే విడుదల బొంది మాయాది ఆవరణములు లేని బ్రహ్మపదమును పొందుచున్నాడు.
53. దేహాదులున్ను నా కొఱకే ప్రియములుగ తోచుచున్నవి. కాబట్టి నాయందే భక్తి కలిగియుండవలెను.
54.  భగవంతుడగు విష్ణువు యొక్క కథలను వినుట, ధ్యానించుట, రచించుట, నిరూపించుట ద్వారా సాధకుడు త్వరితగతిని భక్తి యోగము పొందవచ్చును.
55.  ఆత్మఙ్ఞానము యొక్క సూక్ష్మమార్గం చాలకాలము నుండి లుప్తమై పోయినది. దానిని తిరిగి ప్రవర్తింపజేయుటకే భగవానుడు ఉద్భవించునది.
56.    పరమాత్మయందు ఆసక్తి కలిగి యున్నచో అదియే మోక్షమునకు కారణమగుచున్నది.
57. వివేకవంతులు సంగము (ఆసక్తి) నే ఆత్మ యొక్క అచ్ఛేద్యమగు బంధనముగా తలంచుచున్నారు. ఆ సంగమే మహాత్ముల యెడల గావించబడినచో మోక్షము యొక్క తెరవబడిన ద్వారమగుచున్నది.
 58. భక్తుల లక్షణాలు: సహనశీలురు, దయాళువులు, ప్రాణులందఱికిని అకారణముగనే హితమాచరించు వారును, నా కొఱకై తమ సమస్త కర్మలను, సొంత బంధువులను కూడ వదలి వేయువారును, నా యందు దత్తచిత్తులై, నా యొక్క పవిత్రకథలను వినువారును, కీర్తించువారును, నాయందే మనస్సును లగ్నము చేయువారును అగు భక్తులకు సంసారమందలి వివిధతాపములు ఏవియు కష్టమును కలిగింపజాలవు.
59. సజ్జనుల సాంగత్యమువలన భగవంతుని పరాక్రమమును గూర్చిన యథార్థఙ్ఞానమును తెలుపునట్టియు, హృదయమునకు, చెవులకు ఇంపుగా నుండునట్టియు కథలు వినుట తటస్థించును. వానిని సేవించుటచే మోక్షమార్గమునందు శ్రద్ధ, ప్రేమ, భక్తి క్రమముగ వికసించును.60.    యోగము యొక్క భక్తి ప్రధానములగు సరళ ఉపాయముల ద్వారా సాధకుడు మనోనిగ్రహముకై ప్రయత్నించవలెను.
61. ప్రకృతి యొక్క గుణములచే ఉత్పన్నమైన శబ్దాది విషయములను త్యజించుట వలనను, వైరాగ్యయుక్తమగు ఙ్ఞానము చేతను, యోగము చేతను, భగవంతుని యెడల సుధృడ భక్తిచేతను, మనుజుడు తన అంతరాత్మయగు పరమాత్మను ఈ దేహమందే పొందుచున్నాడు.
62.  ఈ ప్రపంచమంతయు దేనిచే వ్యాపించబడి ప్రకాశించు చున్నదో, అట్టి ఆత్మయే పురుషుడు. (సూర్యుడు) అతడు అనాది, నిర్గుణుడు, ప్రకృతికంటే పరమైనవాడు. హృదయమున స్పురించువాడు. స్వయంప్రకాశుడు.
63.  ఆ పురుషుడు త్రిగుణాత్మకమగు మాయను తన ఇచ్చచే స్వీకరించెను.
64.  ప్రకృతి తన సత్త్వాది గుణముల ద్వారా తనకు అనురూపమగ ప్రజలను సృష్టింపదొడగెను. ఇది చూచి, పురుషుడు ఙ్ఞానమును కప్పివేయు దాని ఆవరణ శక్తిచే మోహితుడై తన స్వరూపమును మఱచిపోయెను.
65.  ఈ ప్రకారముగ తనకంటె వేఱైన ప్రకృతినే తన స్వరూపముగ తలంచుటవలన, పురుషుడు ప్రకృతి యొక్క గుణములచే చేయబడు కర్మలకు తానే కర్త అని భావించుచున్నాడు.
66.  ఇట్టి కర్తృత్వాభిమానము చేతనే అకర్తయు, స్వాధీనుడును, సాక్షియు, ఆనందస్వరూపుడును అగు పురుషునకు జనన మరణరూపబంధనము, పరతంత్రత సంభవించుచున్నది.
67.  ఆ అభిమానము వలన, దేహసంసర్గముచే చేయబడు పుణ్యపాపరూపకర్మల దోషముచే తన శాంతిని పోగొట్టుకొని ఉత్తమ, మధ్యమ, అధమ జన్మలను పొందుచు సంసార చక్రమున తిరగాడు చున్నది.
68.    కాబట్టి బుద్ధిమంతుడగువాడు విషయసేవనమందు తగుల్కొనిన చిత్తమును తీవ్రభక్తి యోగము ద్వారా మెల్లమెల్లగ తన వశము చేసికొనవలెను. నిష్కామభావముతో చేయబడిన స్వధర్మపాలన ద్వారా హృదయము  శుద్ధపడగా, బహుకాల మాచరించిన భగవత్కథా, శ్రవణముల ద్వారా ఏర్పడిన ధృడమైన దైవభక్తి చేత మనుజుని ప్రకృతి అనగా అవిద్య అహర్నిశములు క్షీణించుచు నెమ్మదిగ నశించిపోవును.
69.  అనుభవించి వదలి వేయబడిన ఆ ప్రకృతి, సదా దాని యందు దోషమును చూచుట వలన, ఇక స్వస్వరూపమున ఉన్నవాడును, బంధముక్తుడును అగు మనుజుని ఏ మాత్రము చెడగొట్టజాలదు.
70. ధైర్యవంతుడగు నా భక్తుడు నా యొక్క అనుగ్రహముచే తత్త్వఙ్ఞానమును బడసి ఆత్మానుభవము ద్వారా సమస్త సంశయముల నుండి విడివడుచున్నాడు.
71. భక్తియోగమందు తత్పరమైనదియు, రాగద్వేషాది వికారములు లేనిదియునగు చిత్తము పరమాత్మను పొందును.
72.  దేహత్మ దృష్టి కలవారును అగు దుష్టుల సాంగత్యమును ఎన్నడును చేయరాదు.
73.  స్త్రీల యొక్కయు, స్త్రీల సాంగత్యము కలవారి యొక్కయు, సాంగత్యము వలన జీవునకు ఎట్టి మోహము, బంధనము కలుగునో, అట్టి బంధనము మఱిదేని యొక్క సాంగత్యము వలనను కలుగనేరదు.
74.    యోగము యొక్క గొప్పపదమందు ఆరూఢుడు కాదలంచిన వారు లేక మత్సేవా ప్రభావముచే, ఆత్మానాత్మ వివేకమును బడసినవాడు స్త్రీల సాంగత్యమును ఎన్నడును చేయరాదు.
75. జీవుడు మరణాదులవలన భయమునుగాని, దీనత్వమును గాని, మోహమును గాని పొందరాదు.76.  అతడు తన యదార్థస్వరూపము నెఱిగి ధైర్యముగ, నిస్సంగభావముతో సంచరించవలెను.
77. యోగ, వైరాగ్యసహితమగు సమ్యక్ ఙ్ఞానముతో గూడిన బుద్ధిచే అనాసక్తముగ వ్యవహరించవలెను.
78. ఎవరు స్వధర్మములను భగవంతుని ప్రసనత్వము కొఱకే వానిని పాలించుదురో, అట్టి అనాసక్తులు సత్వగుణముద్వారా సర్వధా శుద్ధచిత్తులగుచున్నారు.
79. వారు తుదకు సూర్యమార్గము (అర్చి మార్గము) ద్వారా సర్వవ్యాపి అయిన శ్రీహరినే పొందుచున్నారు.
80. భగవంతుడగు వాసుదేవుని యెడల ఒనర్పబడు భక్తియోగము ప్రపంచము యెడల వైరాగ్యమును, బ్రహ్మ సాక్షాత్కారరూపమగు ఙ్ఞానమును శీఘ్రముగ కలుగజేయును.
81.  ఒక్క భగవంతుడే స్వయముగ జీవుడు, శరీరము, విషయములు, ఇంద్రియాదులు మున్నగు అనేక రూపములందు గోచరించుచున్నాడు.
82. యోగుల యొక్క అభీష్టఫలము సమస్త దృశ్య ప్రపంచము యెడల సంగము (ఆసక్తి) లేకుండుటయే యగును.
83.  బ్రహ్మము ఏకమును, ఙ్ఞానస్వరూపమును, నిర్గుణమును అయియున్నది.
84.  ఎవడు శ్రద్ధ, భక్తి, వైరాగ్యము, నిరంతర యోగాభ్యాసము ద్వారా ఏకాగ్ర చిత్తుడును, అసంగబుద్ది గలవాడును అగునో అట్టివాడే ఈ జగత్తును బ్రహ్మరూపముగ వీక్షింపగల్గును.
85. దైవవిధానము ననుసరించి సుఖముగాని, దుఃఖముగాని ఏది లభించునో దాని యందే చిత్తమును సంతుష్టపఱచవలెను.
86. మనుజుడు తనకంటె అధికుడైన గుణవంతుని చూచి సంతోష పడవలయును. తనకంటె తక్కువగుణములు కలవాని యెడల దయ కలిగియుండవలెను. ఇట్లుండుటచే అతనిని దుఃఖమెన్నడును బాధింపకుండును.
87. పరమాత్మ యొక్క మానసపూజ చేయువారి అంతఃకరణమున హృదయకమలమునందు, భగవానుడు తన పాదారవిందములను వుంచి విరాజిల్లుచుండును.
88.  భగవంతుడెవని యెడల ప్రసన్నుడగునో అట్టివానికి జనులందఱును నమస్కరించుదురు.
89.  తనకంటె పెద్దవారి యెడల సహనశీలత్వము, చిన్నవారి యెడల దయ, సమానుల యెడల మిత్రత్వము, సమస్త జీవుల యెడల సమత్వ వర్తనము కలిగియుండుటచేతనే సర్వాత్మయగు శ్రీహరి ప్రసన్నుడగును.
90. హృదయమున వాత్సల్యవశమున విశేషరూపముతో విరాజమానుడై యున్న ఆ నిర్గుణ, అద్వితీయ, నాశరహిత, నిత్యముక్త పరమాత్మను అధ్యాత్మదృష్టితో మీ అంతఃకరణమున వెదుకుడు.
91.  అట్లొనర్చుటచే భగవంతుని యందు మీకు సుధృడమగు భక్తి కలుగును. వారి ప్రభావముచే “నేను” “నాది” అను రూపమున మీకు ధృడపడిన అవిద్యాగ్రంథి ఛేదించి వేయబడగలదు.
92.  క్రోధము శ్రేయోమార్గము యొక్క పరమ విరోధి అయియున్నది.
93.  సంసారపాశము నుండి విడుదల పొందుటకై సర్వజీవులందును సమదృష్టి కలిగి శ్రీహరిని భజింపుడు.
94.  శాస్త్రములు జీవులశ్రేయస్సు కొఱకై చక్కగ విచారించును. దేహాదుల యెడల  వైరాగ్యము కలిగియుండుట, తన ఆత్మ స్వరూపమగు నిర్గుణ బ్రహ్మమందు సుధృడమగు అనురాగము కలిగి యుండుట  అను నివియే జీవుని శ్రేయస్సునకు సాధనములని వానియందు నిశ్చయింపబడినది.
95.  పరబ్రహ్మమందు సుధృడమగు ప్రీతి కలుగగా మనుజుడు సద్గురువును శరణుబొందును.
96.  ఇంద్రియాసక్తమగు మనస్సు బుద్ధి యొక్క విచారణాశక్తిని క్రమముగ హరించి వేయుచున్నది.
97.  ఎపుడు విచారణశక్తి నశించునో, అపుడు పూర్వాపరముల స్మృతి నశించును. ఎపుడు స్మృతి నశించునో అపుడు ఙ్ఞానము ఉండదు.
98.    ఙ్ఞానము యొక్క నాశముచే ఎట్టి హాని కలుగునో, దానిని మించిన హాని ప్రపంచమున జీవునకు మఱియేదియు నుండదు.
99.  ధనము, ఇంద్రియ విషయములు  వీనిని గూర్చిన చింతన మనుజుని పురుషార్ధములన్నింటిని నశింపజేయును.
100. అఙ్ఞానాంధకారమును పోగొట్టుకొనదలంచువాడు విషయము లందాసక్తి ఎన్నడును కలిగియుండరాదు.
101.  ఇష్టము వచ్చినట్లు చేయరాని కర్మలను చేసినచో, మనుజుడు అభిమానమునకు వశుడై కర్మలందు బద్ధుడగును.
102.  చెట్టు యొక్క మొదలుకు నీరుపోయుటచే దాని బోదె, కొమ్మలు, చిలువలు మున్నగునవి యన్నియు ఎట్లు పోషింపబడునో అట్లే భగవంతుని పూజించినచో సమస్తమును పూజించినట్లగును.
103. దేనిచే అంతఃకరణము శుద్ధమగునో అట్టి దివ్యమగు తపస్సునే ఈ శరీరముతో చేయవలెను. దీనిచేతనే అనంతమగు బ్రహ్మానందము సంప్రాప్తించును.
104.  మహాత్ముల యొక్క సేవను మోక్షమునకు ద్వారముగను, కాముకుల సాంగత్యము నరకమునకు ద్వారముగను శాస్త్రములు చెప్పినవి.
105. వాసుదేవుడగు నా యందెంతవఱకాతనికి ప్రీతి కలుగకుండునో, అంతవఱకు అతడు దేహబంధనము నుండి విడివడనేరడు.
106.    శాస్త్ర, సజ్జనుల వచనములందు సత్యత్వబుద్ధి కలిగియుండుట చేత, నిరంతరము జాగరూకుడై యుండుటచేత, అంతటను నా యొక్క సత్తను వీక్షించుటచేత, అహంకారరూపమగు తన లింగశరీరమును (సూక్ష్మ దేహమును) లయింపజేయవలెను. ఆపిదప ఏ సాధనయు లేక పూర్ణ విరామమును పొందవలెను. 107.  నా లోకమును పొందదలచువాడు రాజు అయినచో తన ప్రజలకును, గురువైనచో తన శిష్యులకును, తండ్రి అయినచో తన బిడ్డలకును ఇట్టి శిక్షణనే ఒసంగవలెను.
108.  అఙ్ఞానవశమున దీనిననుసరించక విషయాసక్తి యుక్తమగు కర్మనే పరమ పురుషార్థముగ ఎవరైన భావించుచో వారిని కోపగించక, మెల్లగవారికి నచ్చచెప్పి కర్మమందు ప్రవృత్తులు కాకుండునట్లు చూడవలెను.
109. కామము, క్రోధము, మదము, లోభము, మోహము, భయము మున్నగు శత్రువులకును, కర్మబంధనమునకును మూలము మనస్సే అయియున్నది.
110.  అట్టి మనస్సు పై విశ్వాసముంచినచో, యోగిని భ్రష్ట మొనర్చివేయును. కావున మనస్సును జయించి భగవంతుడగు శ్రీకృష్ణుని యెడల అనన్యభక్తి కలిగియుండవలెను.
111.    విషయరహితమగు మనస్సే అతనికి శాంతిమయమగు మోక్ష పదమును ఒసంగును.
112.  మనస్సును ఉపేక్ష చేసినందువలన అది ఇంకను బలపడును. Prevention is better than cure. అది స్వయముగ సర్వధా మిథ్య అయి యున్నను, మీ యొక్క ఆత్మ స్వరూపమును అది కప్పివేయును.
113. కాబట్టి మీరు జాగరూకులై శ్రీగురువు యొక్కయు, శ్రీహరి యొక్కయు పాదములను ఉపాసించుట యను అస్త్రముచే దానిని వధించి వేయుడు.
114.  ఎపుడు భగవత్కథలు సదా సేవింపబడుచుండునో, అపుడవి మోక్షకాంక్షి యగు మనుజుని నిర్మల బుద్ధిని భగవంతుడగు వాసుదేవుని యందు సంలగ్నము చేయును.
115. విరక్తులగు మహాత్ముల సత్సాంగత్యముచే ప్రాప్తించు ఙ్ఞానమను ఖడ్గముచే మనుజుడు ఈలోకమందే తన మోహబంధనమును ఛేదించి వేయవలెను.
116.  మనుష్యుడు మనస్సు, వాక్కు, శరీరములచే పాపము చేయుచున్నాడు.
117.  పాపములకు యథార్థమగు ప్రాయశ్ఛిత్తము తత్త్వఙ్ఞానమే అయియున్నది.
118. ఎవడు నియమములను చక్కగ పాలించునో, అతడు మెల్ల, మెల్లగ పాపవాసన నుండి విముక్తుడై శ్రేయోదాయకమగు తత్త్వ ఙ్ఞానమును పొందుటకు సమర్థుడగుచున్నాడు.
119.  ఎవరు ఈ సంసార బంధనము నుండి తప్పించుకొనదలంచుదురో, వారికి భగవంతుని నామమునకు మించిన మఱియొక సాధనమేదియును లేదు.
120.  భగవంతుని ద్వారా నిర్మితమైన భాగవతధర్మము పరమశుద్ధమైనది. రహస్యమైనది. దానిని తెలిసికొనుట కష్టము. దానిని తెలిసికొనినవాడు భగవత్స్వరూపమును పొందును.
121.  ఈ ప్రపంచమున జీవుల యొక్క పరమ కర్తవ్యము, పరమధర్మము నామ సంకీర్తనాది ఉపాయములద్వారా భగవంతుని పాదము లందు భక్తి భావమును బడయుటయే యగును.
122. ఎవరు భగవంతుని యొక్క ఉదారములైన, కృపాపరిపూర్ణములైన చరిత్రలను శ్రవణము, కీర్తనము గావించుదురో, వారి హృదయమందు ప్రేమమయమగు భక్తి జనించును.
123. ఎవరు హృదయము నుండి పొంగివచ్చుచున్న భయంకరమగు క్రోధమును ఆత్మవిచారణ ద్వారా శరీరమందే శమింపచేయుదురో, బయటకు రానీయకుందురో, వారు కాలక్రమమున మూడు గుణములపై (సత్వ, రజో, తమో గుణములపై) విజయమును పొందగలరు.124.  ఈ సృష్టి లేనపుడు కేవలము నేనే నిష్ర్కియా రూపమున ఉంటిని. నేను కేవలము ఙ్ఞానస్వరూపుడను, అవ్యక్తుడను. అపుడు అంతట ప్రశాంతత వ్యాపించి యుండెను.
125.  ఎవరు తమ్ము తాము గొప్ప బుద్ధిమంతులుగ తలచుకొని కర్మ యొక్క జంజాటమున పడియున్నారో, వారికి విపరీతఫలము లభించుచున్నదని యెఱుగవలెను.
126. ఆత్మ యొక్క స్వరూపము మహాసూక్ష్మమనియు, జాగ్రత్, స్వప్న, సుషుప్తులను మూడవస్థలకంటెను వేఱుగనున్నదనియు తెలిసికొనవలెను.
127.  విషయభోగముల నుండి తన మనస్సును వివేక బుద్ధి ద్వారా మఱలించి, ఙ్ఞాన, విఙ్ఞానములందే సంతుష్టిని బడసి నా భక్తుడు కావలెను.
128.  బ్రహ్మ, ఆత్మల ఏకత్వమును అనుభవించుటయే జీవుని గొప్ప స్వార్థము, పరమార్థము అని బాగుగ యెఱుంగవలయును.
129.  సుఖమును గాని, దుఃఖమును గాని ఒసంగునది తన ఆత్మ కాదు.
130.    ఈ ప్రపంచము సత్వ, రజ, స్తమో గుణముల స్వాభావిక ప్రవాహమై యున్నది.
 131. మనుజుడు అఙ్ఞానవశమున ఆత్మయందు దేవత, మనుష్యుడు ఇత్యాది భేదమును, గుణదోషాదుల కల్పనను గావించుచున్నాడు.
132. తమ తమ కర్మానుసారము దైవవశమున జీవులు కలిసికొనుచు మరల విడిపోవుచు నుందురు.
133.  శరీరరహితమగు ఆత్మను శరీరమని భావించుటయే అఙ్ఞానము.
134. ఎపుడు ఎవడైనను దేవతలను, వేదములను, గోవులను, బ్రహ్మనిష్ఠులను, సాధువులను, ధర్మమును, నన్ను ద్వేషించునో అపుడాతని వినాశము శీఘ్రముగ సంభవించును.
135.  భగవంతుని ప్రసన్నునిగ జేయుటకు పెద్ద పరిశ్రమ గాని, ప్రయత్నము గాని చేయనవసరము లేదు. ఏలయనిన, వారు సమస్త ప్రాణుల యొక్క ఆత్మ మఱియు సర్వత్ర, సర్వుల యొక్క సత్తారూపమున స్వయం సిద్ధమైనవారు అయివున్నారు.
136.  భగవంతుని విశ్వవ్యాపకము
137.  బ్రహ్మదేవుడు మొదలుకొని తృణము వఱకు గల సమస్త ప్రాణులందును, పంచ భూతములచే చేయబడిన వస్తువులందును, పంచ భూతములందును ( భూమి, గాలి, అగ్ని, వాయువు, ఆకాశము), సూక్ష్మ తన్మాత్రలందును, మహత్తత్వమందును, త్రిగుణములందును, గుణముల సామ్యావస్థయగు ప్రకృతియందును ఒకే పరమాత్మ వెలయుచున్నారు. వారు సౌందర్య, మాధుర్య, ఐశ్వర్యముల యొక్క నిధి అయియున్నారు. వారే అంతర్యామిగను, ద్రష్టగను ఉన్నారు. వారు అనిర్వచనీయులును, వికల్పరహితులును అయిఉన్నారు.
138.  వారు కేవలము అనుభవస్వరూపులును, ఆనంద స్వరూపులును అగు పరమేశ్వరుడు అయిఉన్నారు.
139.  గుణమయమగు సృష్టి ఒనర్చు మాయ ద్వారా భగవంతుని యొక్క ఐశ్వర్యము తెలియుట లేదు. ఆ మాయ తొలగగనే వారి దర్శనమగు చున్నది.
140.  కాబట్టి మీరు మీ దైత్యస్వభావమును, అసురీ సంపత్తిని వదిలిపెట్టి సమస్త ప్రాణుల యెడల దయ కలిగియుండుడు. ఫ్రేమతో వారికి హితము చేయండి. దీనిచే భగవంతుడు ప్రసన్నుడగును.
141.  నిర్మలఙ్ఞానము భగవంతుని యెడల అనన్య ప్రేమగల భక్తుల యొక్క పాదకమలముల ధూళిచే తన శరీరమునకు స్నానమొనర్చు వారికందఱికిని సంప్రాప్తించగలదు.
142.  భగవంతుడు ప్రసన్నుడైనచో ఇక లభించని వస్తువేది కలదు?
143.  విఙ్ఞాన సహితమగు ఈ నిర్మల ఙ్ఞానము పరిశుద్ధమైన భాగవత ధర్మమై యున్నది.
144.  ఆత్మ తత్వము నిత్యమైనది.  నాశరహితమైనది. శుద్ధమైనది. ఏకమైనది. క్షేత్రఙ్ఞమైనది. ఆశ్రయమైనది. నిర్వికారమైనది. స్వయం ప్రకాశమైనది. సర్వమునకు కారణమైనది. వ్యాపకమైనది. అసంగమైనది. ఆవరణ రహితమైనది.
145.  గుణములు, కర్మలు వీని వలన కలుగు జనన మరణ చక్రము ఆత్మను శరీరము కంటెను, ప్రకృతి కంటెను వేఱు చేయని కారణము వలననే సంభవించుచున్నది.
146.  కనుక మీరు మొట్ట మొదట ఈ గుణముల ననుసరించి కలుగు కర్మల యొక్క బీజమునే నశింపచేయవలెను. దీని వలన బుద్ధి వృత్తుల యొక్క ప్రవాహము తొలగిపోవుచున్నది.
147.  ఏ ఉపాయముచే భగవంతుని యందు స్వాభావికమగు నిష్కామ ప్రేమ, భక్తి కలుగునో ఆ ఉపాయము సర్వ శ్రేష్ఠమైనది.
148.  శ్రీహరి సమస్త ప్రాణులందును విరాజమానులై వున్నారన్న భావనచే యథాశక్తి సమస్త ప్రాణుల యొక్క కోరికలను పూర్ణమొనర్చవలెను మఱియు హృదయపూర్వకముగ వారిని గౌరవించవలెను.
149.    విషయభోగ సంబంధములైన మాటలు వినుటకు మాత్రము ఇంపుగా నుండును.
150.  ఙ్ఞానులు శబ్ధముల మాయ నుండి ఉపరతులగుచున్నారు.
151.  మోక్షప్రాప్తికి పది సాధనలు చాల ప్రసిద్ధమై యున్నవి. అవి మౌనము, బ్రహ్మచర్యము, శాస్త్రశ్రవణము, తపస్సు, స్వాధ్యయనము, స్వధర్మపాలనము, యుక్తుల ద్వారా కావింపబడు శాస్త్రవ్యాఖ్యానము, ఏకాంతసేవనము, జపము, సమాధి అనునవి.
152.  నవవిధ భక్తి మార్గములు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ద్వారా శ్రీహరిని ప్రార్ధించవలసినది.
153.  ధర్మ, అర్థ, కామములు అన్నియు భగవంతుని ఆశ్రయించుకొని యున్నవి. వారి ఇచ్చ లేనిచో అవి లభింపజాలపు.
154.  జీవుడు ఆత్మ సాక్షాత్కారము ద్వారా ఈ దేహ, ఇంద్రియాదులను కల్పనామాత్రములుగ నిశ్చయించి స్వతంత్రుడు కానంతవఱకు “నేను పురుషుడను, ఈమె స్త్రీ” అనునిట్టి ద్వైతము నశించదు.
155.  భగవంతుడు సర్వత్ర వ్యాపించియున్నను, ఒకచోట క్రొత్తగా ప్రవేశించుటగాని, అట నుండి తొలగుటగాని లేకున్నను, అగ్నియందు, గురువు నందు, అత్మ యందు, సమస్త ప్రాణికోట్ల యందు వారు విశేష రూపమున విరాజమానులైయున్నారు. కావున వారిపై సదా భక్తిని కలిగివుండవలెను.
156.  వాద వివాదముల కొఱకై తర్కము చేయరాదు. ప్రపంచమున ఏ పక్షమున్ను వహింపరాదు.
157.  తృష్ణ ఎటువంటిదనగా, ఇచ్ఛానుసారము భోగములు సంప్రాప్తించినను అది తృప్తిపడదు.
158.  సుఖమే ఆత్మ యొక్క స్వరూపము, సమస్త క్రియల యొక్క నివృత్తియే దాని ఆకారము. తన ఆత్మ కంటె వేఱైన వస్తువునందు సుఖము కలదని తలంచు మనుజుడు ఆత్మను వదలి విషయముల వైపుకు పరుగెత్తుచున్నాడు.
159.  దేనిచే పొట్ట నిండునో కేవలము అంతమాత్రపు ఆహారము పైన, ధనము పైన మాత్రమే మనుష్యులకు అధికారము కలదు. దాని కంటె అధికమైన ఆహారమును, సంపత్తిని తనదని భావించినచో అట్టివాడు దొంగయే యగును. మఱియు అతడు దండనకు పాత్రుదగును.
160.  ఎచట సత్పాత్రులు లభించుదురో, అదియే అన్నిటికంటె పవిత్రమైన దేశము.
161.  పుష్కరాది సరోవరములు, సిద్ధ పురుషులచే సేవింపబడు క్షేత్రములు, కురు క్షేత్రము, గయ, ప్రయాగ, పులహాశ్రమము, నైమిశారణ్యము, ఫాల్గుణ క్షేత్రము, సేతు బంధము, ప్రభాసము, ద్వారక, కాశి, మధుర, పంపా సరోవరము, బిందు సరోవరము, బదరికాశ్రమము, అలకనంద సీతారాముల ఆశ్రమములు (అయోద్య, చిత్ర కూటాదులు), భగవంతుని అర్చావతారము లున్న చోట్లు అన్నియు చాల పవిత్రములైనవి. 162.  శ్రేయస్సును కోరువాడు ఈ ప్రదేశములను మరల, మరల సేవించవలెను. ఈ స్థానములందు ఏ యే పుణ్యకర్మలాచరించబడునో, వాటికి వెయ్యి రెట్లు అధికఫలము మనుజులకు లభించగలదు. అలాగే యాత్రాస్థలముల యందు, పుణ్యతిధుల యందును పాపపు కర్మలాచరించకుండా వుండ వలెను.
163.  ఎవరు పరప్రాణిని ద్వేషించుదురో, వారు విగ్రహములను పూజించినను, ఉపాసించినను, వారికి సిద్ధి లభించజాలదు.
164.    సద్ధర్మ పరిపాలనను అభిలషించువారు ఏ ప్రాణికిని మనస్సు, వాక్కు, శరీరములద్వారా ఏ ప్రకారమైన కష్టమును కలిగించరాదు. దీనిని మించిన ధర్మమేదియును లేదు.
165.  ఎవని మనస్సు నందు సంతుష్టి కలదో, అతనికి సదా ఎల్లెడల సుఖమే కలుగును. దుఃఖము కలుగనే కలుగదు.
166.  గొప్ప గొప్ప విద్వాంసులు కూడ అసంతుష్టి వలన పతనమై పోవు చున్నారు.
167.  సంతుష్టి లేనివానికి ఇంద్రియలోలత్వము వలన తేజస్సు, విద్య, తపస్సు, కీర్తి క్షీణించిపోవును. అతడు వివేకమును పోగొట్టుకొనును.
168.  సంకల్పమును వదలుట ద్వారా కామమును, కోరికలను వదలుట ద్వారా క్రోధమును, ధనమును అనర్ధముగ దలంచుట ద్వారా లోభమును, తత్త్వవిచారణద్వారా భయమును జయించవలెను.
169.  అధ్యాత్మ విద్య ద్వారా శోకమును, మోహమును, మహాత్ములను ఉపాసించుట ద్వారా దంభమును, మౌనము ద్వారా యోగము యొక్క విఘ్నములను, శరీరాదులను చేష్టా రహితముగ నొనర్చుట ద్వారా హింసను జయించవలెను.
170.  దయ ద్వారా ఆధి భౌతిక దుఃఖమును, సమాధి ద్వారా ఆధి దైవిక దుఃఖమును, యోగబలము ద్వారా అధ్యాత్మిక దుఃఖమును, సాత్త్విక భోజనము మున్నగు వాని ద్వారా నిద్రను జయించవలెను.
171.  సత్త్వగుణము ద్వారా రజో గుణ, తమో గుణములను, ఉపరతి ద్వారా సత్త్వ గుణమును జయించవలెను.
172.  గురుభక్తి ద్వారా ఈ సమస్త దోషములును సులభముగ జయించ వచ్చును.
173. హృదయమందు ఙ్ఞాన దీపమును వెలిగించు గురు దేవుడు సాక్షాత్ భగవంతుడే అయియున్నారు.
174.    ఏ దుర్బుద్ధి వారిని మనుష్యుడుగ తలంచునో, అతని శాస్త్ర శ్రవణ మంతయు గజ స్నానము వలె వ్యర్ధమే యగును.
175.  గొప్ప యోగీశ్వరులు ఎవరి పాదకమలములను ధ్యానించుచున్నారో, ప్రకృతి పురుషుల అధీశ్వరుడైన అట్టి భగవానుడే స్వయముగ గురుదేవుని రూపమున వ్యక్తమైయున్నారు.
176.    దేవమాయచే మోహితులైన మూఢుల యెడల కనికరము కలిగి వారిని ఉపేక్షింపవలెను. ఉదాI II కు, కర్మలను త్యజించు గృహస్థుడు, వ్రతములను త్యజించు బ్రహ్మచారి, గ్రామమందు నివసించు వానప్రస్థుడు, ఇంద్రియలోలుడగు సన్న్యాసి మొదలగు వారిని.
177.   నివృత్తి పరాయణుడగు ఙ్ఞాని క్రమముగ అగ్ని, సూర్యుడు, పగలు, సాయంకాలం, శుక్ల పక్షము, పౌర్ణమి, ఉత్తరాయణము వీని అభిమానులగు దేవతల యొద్దకు వెళ్ళి బ్రహ్మలోకమును చేరును.
178.  మహనీయుల సేవ చేతనే భగవంతుడు ప్రసన్నుడగును.
179. ఏ విచారణశీలురు స్వానుభూతిచే అత్మయొక్క మూడు విధములైన అద్వైతములను సాక్షాత్కరించుకొందురో, వారు జాగ్రత్, స్వప్న, సుషుప్తులు, ద్రష్ట, దర్శన, దృశ్యములు అను భేదముతో గూడిన సంసార స్వప్నమును తొలగించు కొనుచున్నారు.
180.  సమస్తము ఒక స్వరూపము అను విచారణ “భావాద్వైతం”, సమస్త కర్మలను పరమాత్మకు సమర్పించుట “క్రియాద్వైతం”, మరియు సమస్త పదార్థములు ఒకే పరమాత్మ స్వరూపము అను విచారణ “ద్రవ్యాద్వైతం” అనబడును.
181.  భగవద్భక్తుడగు మనుజుడు వేదములందు చెప్పబడిన ఇట్టి కర్మల యొక్కయు తదితర స్వకీయ కర్మల యొక్కయు అనుష్ఠానముచే గృహమందున్నను కూడ భగవద్గతిని పొందుచున్నాడు.
182.  ధర్మము యొక్క ఆచరణచే గృహస్థుడు కూడ సన్యాసులకు లభించు ఉత్తమపదమును శీఘ్రముగ పొందుచున్నాడు.
183.  సజ్జనులగు వారు క్షణ భంగురములగు తమ ప్రాణములను కూడ బలి యొసంగి ఇతర ప్రాణులను రక్షించుదురు.
184.  ప్రాణికోట్ల యెడల ఎవరు దయ కలిగి యుందురో, అట్టివారి యెడల భగవంతుడగు శ్రీహరి ప్రసన్నుడగును.
185.  మనుజుడు తన ప్రాణము, ధనము, కర్మ, మనస్సు, వాక్కు మున్నగు వాటి ద్వారా భగవంతుని కొఱకు ఏది చేయబడుచున్నదో, అది యంతయు భేద భావరహితమై యుండుటవలన తన శరీరమునకు, పుత్రాదులకు, ప్రపంచమునకంతటికిని సఫలమగుచున్నది. చెట్టు మొదలుకు నీరు పోయుటచే దాని కొమ్మలు, ఆకులు, అన్నియు తడువబడులట్లు, భగవంతుని కొఱకు కర్మ చేయుటచే, ఆ కర్మలు అందఱి కొఱకు అగుచున్నవి.
186.  భగవంతుని స్మృతి విపత్తులన్నింటి నుండి జీవుని విముక్తము చేయుచున్నది.
187.  అసత్యమాడరాదు,పాపులతో మాట్లాడరాదు, పాపమును గుఱించి మాట్లాడరాదు. చిన్నవి, పెద్దవి అగు సమస్త భోగములను వదిలి వేయవలెను. ఏ ప్రాణికి ఏ విధమైన కష్టమును కలుగజేయరాదు. భగవంతుని ఆరాధన యందేనిమగ్నులై యుండవలెను. ఇదియే భగవంతుని శ్రేష్థమైన ఆరాధన అయియున్నది.
188.  స్వయంప్రాప్తమగు వస్తువుచే సంతుష్టిని పొందువాని తేజస్సు అభివృద్ధిని పొందును.
189.  శరీరధారులగు జీవులు జాగ్రత్, స్వప్నావస్థల యందు కేవలము గుణమయ పదార్థములను, విషయములను సుషుప్తి యందు కేవలం అఙ్ఞానమును చూచుచున్నారు. దీనికి కారణం వారు మీ యొక్క మాయచే మోహితులై యున్నారు. వారు బహిర్ముఖులై యుండుటవలన బాహ్యవస్తువులనే కాంచుచున్నారు.
190.  సంస్కారములచేతనే శుద్ధి కలుగును. ఎట్లనిన కాలముచే జలాదులు, స్నానముచే శరీరాదులు, ప్రక్షాళనముచే వస్త్రాదులు, సంస్కారములచే గర్భాదులు, తవస్సుచే ఇంద్రియాదులు, యఙ్ఞముచే జనుల చిత్తము, దానముచే ధన ధాన్యాదులు, తృప్తిచే మనస్సు శుద్ధపడుచున్నవి.
191.  జీవిత సాఫల్యము ఎంత వఱకు సాధ్యమో అంతవఱకు తన ధనము చేతను, వివేక విచారణ చేతను, వాక్కు చేతను, ప్రాణముల చేతను కూడ ఇతరులకు మేలు కలుగు నట్టి కర్మలను చేయుట యందే కలదు.
192.  ప్రపంచమున ఎవరు “ఈ జగత్తు ఏమి? దీని యందేమి జరుగుచున్నది?”  ఈ మొదలగు విషయములను విచారించుటయందు నిపుణులై యుందురో, అట్టివారు తమ చిత్తమందలి అశుభ వాసనలను, స్వయముగ వివేకశక్తిచే తొలగించుకొందురు.
193.  సమస్త ప్రాణుల యొక్క ముఖ్యముగ మనుష్యుని యొక్క ఆత్మయే హితమును బోధించు గురువైయున్నది.
194.  శ్రీకృష్ణుని పాదపద్మముల యొక్క నిశ్చలమగు స్మృతి సమస్త పాపములను, తాపములను, అమంగళములను నశింపజేసి, పరమశాంతిని విస్తరింపజేయును. దాని ద్వారానే అంతఃకరణము శుద్ధమగును. మఱియు భగవంతుని యెడల భక్తి కలుగును. ఈ ప్రకారముగ పరమ వైరాగ్యయుక్తమగు భగవత్స్వరూపఙ్ఞానము, అనుభవము జీవునకు సంప్రాప్తించును.
195.  భాగవత పురాణమును అధ్యయనము చేయుట వలన బ్రాహ్మణుడు ఋతంభరా ప్రఙ్ఞను (తత్త్వఙ్ఞానమును పొందింపజేయు బుద్ధిని) పొందును.

భాగవత మహాత్య్మము
1.   మనుష్యునకు జన్మ జన్మాంతర పుణ్యము ఉదయించు నపుడు ఈ భాగవత శాస్రమతనికి లభించును.
2.   అనేక శాస్త్రములు, పురాణములు వినుట వలన ఏమి లాభము? ముక్తి నొసంగుటకై ఏక మాత్రమగు భాగవత శాస్త్రము గర్జించుచున్నది.
3.   ఏ ఇంటి యందు నిత్యము భాగవత కథ జరుగుచుండునో, ఆ యిల్లు తీర్థస్థానమై పోవును. మఱియు వాని యందు నివసించు వారి పాపము లన్నియు నశించును.
4.   భాగవత కథను చదువనివారు, విననివారు నీటి బుడగల వలె, దోమల వలె కేవలము చచ్చుట కొఱకే పుట్టుచున్నారు.
5.   గురు వాక్యములందు విశ్వాసము, వినయము, మనస్సు నందలి దోషములను జయించుట, దైవకథలయందు చిత్తైకాగ్రత మొదలగు నియములను పాలించుచో శ్రవణము యొక్క యథార్థ ఫలము లభించును. మనుజులు భాగవత కథను విన్దురో నిశ్చయముగ వారందఱును తుదకు భగవన్నిలయమైన వైకుంఠము నందు నివసించుదురు.
6.   ఎవరు దారిద్ర్యమను దుఃఖ జ్వరము యొక్క జ్వాలచే దగ్ధమగు చున్నారో, ఎవరిని మాయా పిశాచి మర్ధించి వేసినదో, ఎవరు సంసార సముద్రమునందు మునిగిపోవుచున్నారో, అట్టివారికి క్షేమము కలుగజేయుట కొఱకు భాగవతము సింహనాదమొనర్చు చున్నది. కావున ఈ కలికాలమందు దీనిని ప్రయత్న పూర్వకముగ సేవించవలయును.

-Josyam Srinivas
Works at Railways, GUNTUR.
Courtesy :http://pravasarajyam.com/1/devotional/2012/05/04/the-secret-of-bhagavatam/